Sunday, July 26, 2015

Notifications for 15000 jobs in Telangana

-15 శాఖల్లో.. వేల ఉద్యోగాల భర్తీ
-కీలక ఫైలుపై ముఖ్యమంత్రికేసీఆర్ సంతకం
-గరిష్ఠ వయోపరిమితి పదేండ్ల సడలింపు
-నియామక ప్రక్రియ సత్వర ప్రారంభానికి ఆదేశం
-నెరవేరనున్న నిరుద్యోగుల కల అడ్డంకులపై సీఎం స్పష్టత.. త్వరలో ఉత్తర్వులు
-పోలీస్, అగ్నిమాపక శాఖల్లో 8,000 విద్యుత్ శాఖలో 2,681 ఖాళీల భర్తీ
-పోలీస్ ఉద్యోగాలు స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా
-విద్యుత్ శాఖ ఉద్యోగాలు జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలద్వారా 
-ఇతర ఉద్యోగాల భర్తీ టీఎస్‌పీఎస్సీ ద్వారా 
-రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయి ఉద్యోగాల నియామకాలకు ప్రస్తుత నిబంధనలే


మొదటి దశలో ఉద్యోగాలు భర్తీ చేసే శాఖలు
వ్యవసాయం, హార్టికల్చర్, మెడికల్ ఆండ్ హెల్త్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, పోలీస్, ఫైర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రెవెన్యూ, రోడ్లు-భవనాల శాఖ, రవాణా శాఖ, జీహెచ్‌ఎంసీ. 


హైదరాబాద్, నమస్తే తెలంగాణ:రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీపి కబురు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో జూలై నెలలో ఉద్యోగాల భర్తీ చేపడుతం. నిరుద్యోగుల కలలు నెరవేరుస్తం అని ప్రకటించిన కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సొంత రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశించిన విద్యార్థి, నిరుద్యోగ యువతకు ఆ ఫలాలు అతిత్వరలో అందబోతున్నాయి. వారి కలలు నెరవేరబోతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొలువుల భర్తీకి ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపారు. తొలి దశలో భాగంగా 15 ప్రభుత్వ శాఖల్లో మొత్తం 15వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విభాగాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు.

ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం శనివారం సాయంత్రం సంతకం చేశారు. అదే సమయంలో ఈ ఏడాది జరిపే నియామకాలకు సంబంధించి రికార్డు స్థాయిలో పదేండ్లు వయోపరిమితి సడలించాలని కూడా సీఎం నిర్ణయించారు. అంటే.. ఇప్పటిదాకా ఉన్న 34 ఏండ్ల గరిష్ఠ వయోపరిమితి.. 44 ఏండ్లకు పెరుగనుంది. మొదటి దశలో వ్యవసాయం, హార్టికల్చర్, మెడికల్ అండ్ హెల్త్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, పోలీస్, ఫైర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ ఆండ్ రెవెన్యూ, రోడ్లు-భవనాల శాఖ, రవాణా శాఖ, జీహెచ్‌ఎంసీల్లో ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఎస్సైలు, కానిస్టేబుళ్లు సహా పోలీస్, అగ్నిమాపక శాఖల్లో 8,000, విద్యుత్ శాఖలో 2,681 ఖాళీల భర్తీ ఉంటుంది. 


పోలీస్ ఉద్యోగాలను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా, విద్యుత్ శాఖ ఉద్యోగాలను జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలద్వారా భర్తీ చేయనున్నారు. రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి, జిల్లా స్థాయి ఉద్యోగాల నియామకాలకు ప్రస్తుతం ఉన్న నిబంధనలే త్వరలో విడుదల కాబోయే నోటిఫికేషన్‌లకు అమలుచేయాలని సీఎం ఆదేశించారు. పోలీస్, విద్యుత్‌శాఖ మినహా ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఉద్యోగ నియామక ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. కొలువుల భర్తీ ఆదేశాలతో పాటే అందుకు ఉన్న సంక్షిష్టతలను తొలగించేందుకు సైతం సీఎం కేసీఆర్ స్పష్టమైన సూచనలు ఇచ్చారు.


అడ్డంకులన్నింటిపైన స్పష్టత:


ఉద్యోగాల భర్తీలో భాగంగా నాలుగు అంశాలైన వయోపరిమితి సడలింపు, జోనల్, స్కీమ్ ఆఫ్ సిలబస్, రోస్టర్ విధానంలో అస్పష్టత కారణంగా ఇన్నాళ్లూ ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే వీటి విషయంలో సీఎం కేసీఆర్ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది వయోపరిమితిని ఏకంగా పదేండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వయోపరిమితి పెంపు విషయంలో ఏర్పాటుచేసిన ముగ్గురు మంత్రుల కేబినెట్ సబ్ కమిటీ ఐదేండ్ల వయోపరిమితి ఇవ్వాలని నివేదిక ఇచ్చింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల తప్పిదంవల్ల దాదాపు మూడేండ్లు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు లేని నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉండటాన్ని సీఎం గమనంలోకి తీసుకున్నారు. అర్హులైన నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలని భావించి.. వయోపరిమితిని పదేండ్లు పెంచారు. తద్వారా భారీ స్థాయిలో నిరుద్యోగులు ఉద్యోగాలకు పోటీ పడేందుకు అవకాశం దొరకనుంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న జోనల్, రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి నిబంధనలు అమలుచేయాలని సీఎం స్పష్టం చేయడం నియామక ప్రక్రియలో జాప్యం నివారించేందుకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. కొత్త నియామక విధివిధానాలు అవలంబించాలంటే అందుకు తగ్గ మార్గదర్శకాలు రూపొందించడం, వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపడం, అక్కడి నుంచి అనుమతులు రావడం అనే సుదీర్ఘ ప్రక్రియ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తతంగం జాప్యానికి కారణం అవుతుందని, అందుకే తాజా నిబంధనలు కొనసాగించి, ప్రక్రియ త్వరగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారని విశ్లేషిస్తున్నారు. మరోవైపు స్కీం ఆఫ్ సిలబస్, రోస్టర్ విధానంలోనూ త్వరలోనే ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఉన్న సంక్లిష్టతలు తొలగించేందుకు ఇప్పటికే అడ్వకేట్ జనరల్ స్థాయిలో, న్యాయశాఖలో చర్చలు పూర్తయినట్లు తెలుస్తున్నది. త్వరలోనే ఈ విషయంపై ఆదేశాలు రానున్నాయని సమాచారం. స్కీం ఆఫ్ సిలబస్ విషయంలో కసరత్తు చేసి త్వరలో తుదినిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది.


ఖాళీలు ఇవీ..


రోడ్లు భవనాల శాఖ తమ శాఖలో 200 ఖాళీలున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 125 జూనియర్ ఇంజినీర్లు, 75 టెక్నికల్ అసిస్టెంట్లు భర్తీ కావాల్సి ఉందని ఆ శాఖ నివేదికలో పేర్కొంది. తమ శాఖ పరిధిలో 1081 పోస్టుల భర్తీ చేయాల్సిన అవసరం ఉందని మున్సిపల్ శాఖ సర్కారుకు వివరాలు అందజేసింది. గ్రేడ్-2, గ్రేడ్-3 కమిషనర్, అకౌంటెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్ తదితరాలు 325 ఖాళీలు ఉన్నాయని ప్రతిపాదించారు. రవాణాశాఖలో 36 ఉన్నట్లు ప్రతిపాదనలు పంపారు. ఆరు ఆర్టీవో, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఖాళీలు 30 ఉన్నట్లు సమాచారం. టౌన్‌ప్లానింగ్ విభాగంలో 241 పోస్టులు, ఇంజినీరింగ్ విభాగంలో 515 ఖాళీలు ఉన్నట్లు శాఖ ప్రతిపాదించింది. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో దాదాపు 4,000, వ్యవసాయ శాఖలోని 1,100 పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. రెవెన్యూ విభాగంలో దాదాపు 6,000 ఖాళీలు గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్‌కి అవసరమైన 418 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 125 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అవకాశం ఉంది.

1 comment: