Wednesday, June 17, 2015

25000 Jobs Coming Soon in Telangana


నీళ్లు, నిధులు, నియామకాలు... ఈ మూడే తెలంగాణ ఉద్యమ నినాదాలు. వాటిని అమలు చేసే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. నిరుద్యోగుల కలలను సాకారం చేసే దిశగా లక్ష కొలువుల జాతరకు తెలంగాణ సర్కార్ సన్నద్ధమైంది. దానిలో భాగంగా మొదటి దఫాలో 25000 కొలువులను నింపేందుకు సర్కారు సిద్ధమైంది. ఆరుపదుల పోరాట ఫలితంగా మన ఉద్యోగాలు మనకే దక్కనున్నాయి. దీనిలో అగ్రభాగం పోలీస్ శాఖ భర్తీ చేయనుంది. వాటర్‌గ్రిడ్‌లో ఇంజినీరింగ్ పోస్టులు, అటవీశాఖ, ట్రాన్స్‌కో, జెన్‌కో తదితర ఉద్యోగాలు ఈ మొదటి దఫాలో భర్తీ కానున్నాయి. తెలంగాణ సర్కార్ త్వరలో భర్తీ చేసే కొలువుల సమాచారం ఈ వారం నిపుణలో...

పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు


రాష్ట్రంలో సుమారు లక్షకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. వీటిలో ఎక్కువ సంఖ్యలో ఖాళీలు పోలీస్ శాఖలోనివే. సుమారు 11వేల పోస్టుల దాకా ఈ శాఖలో భర్తీ చేయనున్నారు. వీటిలో కానిస్టేబుల్, కానిస్టేబుల్ (డ్రైవర్), మహిళా కానిస్టేబుల్స్, ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి.

3,600 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు


ఇప్పటికే 3,620 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి లభించగా మిగిలిన అనుమతుల తర్వాత త్వరలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల కానుంది. 

jobs

- అర్హతలు: కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలకు కనీస అర్హతగా సివిల్ కానిస్టేబుల్ తరహాలోనే ఇంటర్ ఉత్తీర్ణత. డ్రైవర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్న దృష్ట్యా రెండేళ్ల సీనియారిటీతో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వయస్సు 18 -25 ఏండ్ల మధ్య ఉండవచ్చు. సివిల్ కానిస్టేబుల్ పోస్టుకు 21 ఏళ్లు కాగా దానికి అదనంగా డ్రైవర్ పోస్టులకు 4 ఏండ్లు ఇవ్వనున్నారు. జనరల్ అభ్యర్థులకు 25 ఏండ్లు, ఎస్సీ/ఎస్టీలకు 30 ఏండ్ల వరకు అనుమతించే అవకాశం ఉంది. వయోసడలింపుకు ప్రధాన కారణం హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అర్హత అందరకీ ఉండదని ఈ మార్పు చేస్తున్నారు.

- పరీక్ష విధానం: ప్రస్తుతానికి పాతపద్ధతిలోనే ఈ పరీక్షను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. పద్ధతిలో మార్పు ఉన్నా లేకున్నా రాతపరీక్ష మాత్రం యధాతథంగా ఉంటుంది. 200 మార్కులకు జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. డ్రైవర్ పోస్టులకు ప్రారంభవేతనం సుమారుగా రూ. 22 వేల వరకు ఉండవచ్చు. వీరికి అలవెన్స్‌లు అదనంగా ఉండే అవకాశం ఉంది.

సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులు


సుమారు 800కు పైగా సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయని సమాచారం. వీటిలో మొదటి దశలో 467 ఎస్‌ఐ (పురుషులు), 77 మహిళా ఎస్‌ఐ పోస్టులు, 59 ఆర్‌ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఎస్‌పీఎఫ్, సైబరాబాద్ పరిధిలో సుమారు 65 ఎస్‌ఐ పోస్టుల వరకు భర్తీ చేయనున్నారు. ఇక కానిస్టేబుల్ పోస్టుల వివరాలను పరిశీలిస్తే 2,978 పురుష కానిస్టేబుల్స్, 338 మహిళా కానిస్టేబుల్, 2,169 ఏఆర్ కానిస్టేబుల్స్, 57 ఏఆర్ మహిళా కానిస్టేబుల్ పోస్టులున్నాయి. వీటితోపాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 174 కానిస్టేబుల్ పోస్టులు, సైబరాబాద్ పరిధిలో 275 కానిస్టేబుల్, 205 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Gjobs

ఎందుకు జాప్యం....?


పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో మార్పులు తేవాలని పోలీస్‌శాఖ భావిస్తున్నది. దీనికి సంబంధించిన ఫైల్‌ను హోంశాఖ నుంచి ప్రభుత్వానికి పంపించారు. కొత్త విధానంలో ముందుగా రాతపరీక్షను నిర్వహించి, అర్హులైన వారిలో నిర్దేశిత పోస్టుల సంఖ్యకు 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను ఆహ్వానించి పరుగుపందెం నిర్వహిస్తారు. అయితే ఇప్పటికే పంపించిన విధివిధానలపై మరికొంత సమాచారం కావాలని సచివాలయంలోని హోంశాఖ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ అధికారులు డీజీపీ కార్యాలయాన్ని అడిగినట్లు తెలిసింది. కొత్త విధానం అమలులోకి రావాలంటే సచివాలయంలోని జీఏడీ, న్యాయశాఖ ఆమోదం ఆపై టీఎస్ పబ్లిక్‌సర్వీస్ కమిషన్ క్లియరెన్స్, చివరగా సీఎం ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రిక్రూట్‌మెంట్‌పై పట్టుదలతో ఉండటంతో నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉంది.

రెండువేలకు పైగా ఇంజినీర్ పోస్టులు


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సుమారుగా 1500 వరకు ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు జరుగుతున్నది. 
ఇప్పటికే 543 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. నీటిపారుదల, భూగర్భజలశాఖ, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

విద్యుత్‌శాఖలో 1900 పోస్టులు


రాష్ట్ర విద్యుత్ శాఖలో కొత్తగా 1,919 ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జెన్‌కో, ట్రాన్స్‌కో, టీఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ విభాగాల్లో 1,492 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, 427 సబ్ ఇంజినీర్ పోస్టులను మంజూరు చేసింది. విద్యుత్ శాఖలో రానున్న సంవత్సరాల్లో భారీగా ఇంజినీర్స్ పోస్టుల భర్తీ జరుగనుంది. 6,280 మెగావాట్ల విద్యుతుత్పత్తికి ప్రభుత్వం యాదాద్రి, భద్రాది, రామగుండం, జైపూర్, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించనుంది. వీటితో వేలాది ఉద్యోగాలు ఈ రంగంలో భర్తీ చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ ప్రభుత్వ పరిధిలోనే ఉండటం నిరుద్యోగులకు వరంగా చెప్పుకోవచ్చు. డిప్లొమా, ఇంజినీరింగ్ చదివిన వారికి రానున్న సంవత్సరాల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

అటవీశాఖలో 2088 ఖాళీలు


రాష్ట్ర అటవీశాఖ పై ప్రభుత్వం దృష్టి సారించింది. హరితహారం లాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ఈ శాఖదే ప్రధాన బాధ్యత. దీనిలో ఇప్పటికే వందలాది ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బంగ్లా వాచర్ వంటి ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎంపిక నిబంధనలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి వీలుకాదని భావించిన అటవీశాఖ అధికారులు పలు అంశాలపై మార్గదర్శకాలను జారీచేయాలని ప్రభుత్వానికి నివేదించింది. సచివాలయంలోని అటవీశాఖ అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం త్వరలోనే ఈ ఉద్యోగుల భర్తీకి మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అటవీశాఖలో సుమారుగా రెండువేల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి జోగు రామన్న ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

15వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు


రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా వివిధ శాఖల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. వీటిలో భారీ సంఖ్యలో పోస్టులున్నవాటిలో మొదటిది విద్యాశాఖ. ఈ శాఖలో ఉపాధ్యాయ పోస్టులు సుమారుగా 25 వేలు వరకు ఉండవచ్చు. వీటిలో 17 వేలు ఖాళీలను విద్యాశాఖ ఇప్పటికే గుర్తించింది. ఇటీవల టీచర్ల ప్రమోషన్స్, రైషలైజేషన్స్‌కు సంబంధించిన సమయంలో ముఖ్యమంత్రి రేషలైజేషన్స్ పూర్తికాగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు.

teacher

సుమారు 17వేలల్లో రేషలైజేషన్‌తో 4-5 వేల వరకు ఖాళీలు తగ్గవచ్చని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. వీటిలో గత డీఎస్సీ బాధితులకు సుమారు రెండు వేలవరకు కేటాయించగా మిగిలిన సుమారు 12 -13 వేల ఎస్‌జీటీలు, నాలుగు వేల స్కూల్ అసిస్టెంట్స్ ఖాళీలు ఉండవచ్చని విద్యాశాఖ అధికారుల అంచనా. అలాగే ప్రభుత్వం గిరిజన పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. వీటితోపాటు బీసీ, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఖాళీల భర్తీ పై కూడా ఆయా సొసైటీలు ప్రభుత్వానికి వివరాలనుపంపిచినట్లు సమాచారం. వీటన్నింటితో సుమారు 20 వేలకు పైగా ఖాళీలు విద్యాశాఖలో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక కేజీ టూ పీజీ విద్య అమలు ప్రారంభమైతే వేలాదిగా ఉపాధ్యాయ పోస్టులు అవసరమవుతాయి.

ప్రత్యేక డీఎస్సీ


రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రేషలైజేషన్‌తో ఆలస్యం అవుతుండటంతో ముందుగా గిరిజన పాఠశాలల్లో ప్రత్యేక డీఎస్సీని నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. 410 స్కూల్ అసిస్టెంట్, 661 ఎస్‌జీటీ, 103 పండిట్, 56 పీఈటీ, 8 క్రాఫ్ట్, 3 డ్రాయింగ్ పోస్టులను కలిపి మొత్తం 1,241 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిపై కూడా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద విద్యాశాఖ నుంచి రాబోయే రెండు మూడునెలల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

వైద్యశాఖలో..


రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి ప్రాధన్యతను ఇస్తున్నది. పలు అస్పత్రుల అభివృద్ధి, వసతులు, స్టాఫ్ పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో దశల వారీగా రానున్న నోటిఫికేషన్స్‌లో వైద్య రంగానికి సంబంధించి డాక్టర్లు, నర్సులు, హెల్త్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ తదితర పోస్టుల భర్తీ చేయనుంది.

employees

ముఖ్యంగా డాక్టర్ పోస్టుల విషయంలో స్పష్టత వచ్చాక నియామకాలు ఉండవచ్చు. అదేవిధంగా మిగిలిన పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటికి తోడు వెటర్నరీ వైద్య పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. 

policejobs


4,442 ఏఏఈవో పోస్టులు


సుమారుగా 4,442 అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఏఏఈవో) పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటికి బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ (వొకేషనల్)/ పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ లేదా తత్సమాన కోర్సు అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు. 

సింగరేణి సిగలో కొలువులు


సింగరేణిలో మూడునెలలుగా సుమారు 5వేల పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పటికే నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. కొన్ని పోస్టులకు రాతపరీక్షను కూడా నిర్వహించారు. మరికొన్నింటికి త్వరలో పరీక్షలు జరుగనున్నాయి. వీటితోపాటు రాబోయే సంవత్సరాల్లో పదవీవిరమణ చేసిన ఖాళీలు, సింగరేణి విస్తరణలో భాగంగా వచ్చే కొత్త పోస్టుల నియామకం జరుగనుంది. 

రాష్ర్టానికి 5,631 రాష్ట్రస్థాయి ఖాళీలు


ఉమ్మడి రాష్ట్ర ఉద్యోగుల విభజనలో భాగంగా ఇప్పటి వరకు కమల్‌నాథన్ కమిటీ 117 శాఖల్లో సుమారుగా 5,631 ఖాళీలు వచ్చినట్లు సమాచారం. ఇవి రాష్ట్రస్థాయి పోస్టులు. ఇంకా సుమారు 70 శాఖల విభజన జరగాలి. ఈ ఖాళీలు జూన్ 1 వరకు వచ్చినవి. వీటికి తోడు పదవీవిరమణ ఉన్న ఖాళీలు అదనం. టీఎస్‌పీఎస్సీ విడుదల చేయబోయే గ్రూప్స్ నోటిఫికేషన్స్‌లో ఈ ఖాళీలే కీలకం కానున్నాయి. 

భర్తీ జాప్యానికి అసలు కారణం


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం జూలైలో కమలనాథన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియను మార్చి 2015 నాటికి పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయితే ఆ సమయం వరకు కేవలం 10 హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్లలో మాత్రమే విభజన పూర్తి చేశారు. ఈప్రక్రియ పూర్తికాకపోవడంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) 2015 అక్టోబర్‌లోగా ప్రక్రియ పూర్తి చేయాలని గడువు పెంచింది. తాజా సమాచారం ప్రకారం మొత్తం 98 హెచ్‌ఓడీలలో 50 విభాగాల్లోనే విభజన పూర్తి అయింది. ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం వల్ల కేడర్ స్ట్రెంథ్‌పై స్పష్టత రావడం లేదు. దీంతో ఖాళీలు ఎన్ని, ఎన్ని కొత్త ఉద్యోగాలు అవసరం ఉన్నాయి? ఏపీ నుంచి వచ్చే ఉద్యోగులు ఎందరు అనే విషయాలపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీలో జాప్యం అనివార్యం అయింది.

ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ


టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించినట్లు లక్ష ఉద్యోగాల్లో మెజార్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం భావించారు. అయితే ఆలస్యం తప్పలేదు. ఈ జాప్యానికి కారణం గ్రహించిన సీఎం కేసీఆర్ మొదటిదశలో 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటన తరవాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని, కార్పొరేషన్లలోని ఖాళీల లెక్కలు వెంటనే సమర్పించాలని ఆదేశించారు. ఈ వివరాలు కాగితాల రూపేణా వస్తే ఆలస్యం జరుగుతుందని గ్రహించిన ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రొఫార్మాను అందజేసింది. ఆయా విభాగాల్లోని ఉద్యోగాలు, ఖాళీలు తదితరాలు వివరిస్తూ ఆ నమూనా ఇచ్చారు. ఈ వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) వెబ్‌సైట్లో నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. మరోవైపు తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో మొదటి అంశంగా ఉద్యోగాల భర్తీ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 25,000 ఉద్యోగాలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయించారు.

సిలబస్‌కు త్వరలో ఆమోదముద్ర


ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన నేపథ్యంలో పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ మారనుంది. మన చరిత్ర, సంస్కృతి, తెలంగాణ భౌగోళిక అంశాలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాల్లో మార్పులు రానున్నాయి. సిలబస్‌లో మార్పులు చేర్పులపై త్వరలోనే స్పష్టత రానుంది. సిలబస్‌లో మార్పులకు సంబంధించి ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో 25 మందితో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ కోదండరాం, తెలుగు యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ శివారెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్, అడపా సత్యనారాయణ వంటి ప్రముఖులకు చోటు కల్పించారు.

ఈ కమిటీ సిలబస్‌లో ఏ అంశాలు ఉండాలి, పరీక్షా విధానం ఎలా ఉండాలో రూపకల్పన చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. ప్రభుత్వం సిలబస్‌ను ఆమోదించడమే తరువాయి. ఉద్యోగాల అధికారిక ప్రకటన జారీ కానుంది. అయితే సిలబస్ మార్పులు అనేవి తెలంగాణ చరిత్ర, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ అనే మూడు అంశాల్లోనే ఎక్కువగా ఉండనున్నాయి. మిగతా అంశాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చనేది సమాచారం. 

పారదర్శకంగా ఉద్యోగ భర్తీ ప్రక్రియ


ఉద్యోగ భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. దీనిలో ముందడుగు టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చైర్మన్‌గా నలుగురు సభ్యులుతో కూడిన టీఎస్‌పీఎస్సీ ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో ఇప్పటికే డిపార్ట్‌మెంటు పరీక్షలను కూడా విజయవంతంగా నిర్వహించింది. ఆన్‌లైన్ పేర్లు నమోదు చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. తమ అర్హతల ఆధారంగా తమ వ్యక్తిగత సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌కు పంపవచ్చు. ఈ వెబ్‌సైట్‌కు ఇప్పటికే 10 లక్షల మంది తమ సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. ఉద్యోగ ప్రకటనలు వెలువడిన సందర్భంలో ప్రతీసారి తమ వ్యక్తిగత సమాచారం నమోదు లేకుండానే అభ్యర్థి ఇచ్చిన సమాచారం దానిలో అప్‌లోడ్ అవుతుంది.

టీఎస్‌పీస్సీ సంవత్సర క్యాలెండర్ ఆధారంగా ఉద్యోగ భర్తీ ప్రక్రియను నిర్వహించేందుకు సన్నహాలు చేస్తుంది. ఇంతకు ముందు ఏపీపీఎస్సీ పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చింది మొదలు ఉద్యోగంలో చేరేసరికి కనీసం 3 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చింది మొదలు పూర్తి అయ్యే వరకు.. అంటే ఇంటర్వ్యూల తేదీలను కూడా ముందే ప్రకటించనున్నారు. ఎక్కడా అక్రమాలకు తావులేకుండా పూర్తిగా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. 

వయోపరిమితిలో సడలింపు


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో విద్యార్థుల పాత్ర ఎనలేనిది. మలిదశ ఉద్యమంలో వారిదే కీలకపాత్ర. 2011తర్వాత సీమాంధ్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త నోటిఫికేషన్లను జారీ చేయలేదు. గత నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ ప్రకటనలులేక నిరుద్యోగుల వయోపరిమితి దాటిపోయి ఉద్యోగాలకు అనర్హులుగా మారే అవకాశం ఉంది. 

ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 10 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.అయితే డిపార్ట్‌మెంటు ఉద్యోగాలకు సడలింపు ఇవ్వాలా వద్దా అనేది ఇంకా ఫైనల్‌కావాల్సి ఉంది. సాధారణంగా అయితే ఓపెన్ కేటగిరిలో గరిష్ఠ వయోపరిమితి 34 సంవత్సరాలు ఉండగా పదేళ్లు పెంచితే ఓపెన్ కేటగిరీకి 44 సంవత్సరాల వరకు అవకాశం లభిస్తుంది. రిజర్వేషన్ కేటగిరీలకు మరింత సడలింపు ఉంటుంది. 

రెండు సంవత్సరాల్లో 1,07,744 ఉద్యోగాలు


తెలంగాణ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో లక్ష ఉద్యోగాలకు పైగా నింపేందుకు కృతనిశ్చయంతో ఉంది. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ 1,07,744 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఆ లక్ష ఉద్యోగాల భర్తీ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. మొదటి దఫాలో 25,000 ఉద్యోగాలు నింపేందుకు సన్నద్ధమెంది. త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి.Source : Nipuna, Namaste Telangana

No comments:

Post a Comment