Sunday, April 12, 2015

రెండేండ్లలో లక్ష ఉద్యోగాల భర్తీ

-నియామకాల తొలి నోటిఫికేషన్ నా శాఖదే
-టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్
-బంగారు తెలంగాణలో కమిషన్‌ది కీలక పాత్ర: గవర్నర్ 
-నెలాఖరులో తొలి ఉద్యోగ ప్రకటన..టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ చక్రపాణి వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:వచ్చే రెండేండ్లలో 1.07 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల అంశాల మీద అని ఆయన గుర్తు చేశారు. ఈ దిశగా టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేటీఆర్ చెప్పారు.

governer

టీఎస్‌పీఎస్సీ తొలి ఉద్యోగ ప్రకటన తన శాఖ పంచాయతీరాజ్ విభాగంనుంచే వస్తున్నదని మంత్రి తెలిపారు. శనివారం సాయంత్రం రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్, లోగోను ఆవిష్కరించారు. ఈ వెబ్‌సైట్‌లో నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన వన్‌టైం పాస్‌వర్డు సిస్టంను మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు.

ktr

ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మ, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సీ విఠల్, మతినుద్ధీన్‌ఖాద్రి, గవర్నర్ కార్యాలయ కార్యదర్శి రమేష్, లోగో చిత్రకారుడు యేలే లక్ష్మన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీకోసం ఎదురు చూస్తున్నారని, ఈ తరుణంలో టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ ప్రారంభించడం శుభసూచకమన్నారు. నిరుద్యోగులకు సమాచారం అందించడంలో ఈ వెబ్‌సైట్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకతకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్‌లలో చేపట్టే ఉద్యోగాల భర్తీలో కూడా పారదర్శకత పాటించాలన్నది సీఎం అభిమతమని చెప్పారు. 

బంగారు తెలంగాణలో మీదే కీలకపాత్ర..


రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాత్ర కీలకమన్నారు. ఇపుడు రాష్ట్రం ముందుకు పోవాలన్నా.. వెనక్కి పోవాలన్నా అది టీఎస్‌పీఎస్సీ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం యువత ఎదురు చూస్తున్నదని, ఆ మేరకు చొరవ తీసుకోవాలని అన్నారు. ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా సాగాలని, ఇందుకోసం ప్రశ్నాపత్రాలను ఇతర రాష్ర్టాలలో తయారు చేయించాలని సూచించారు.

TSPSCLogo

ప్రశ్నాపత్రం తయారీకి కొశ్చన్ బ్యాంకు తయారు చేయాలన్నారు. టీఎస్‌పీఎస్సీ రిక్రూట్‌మెంట్ కేలండర్ రూపొందించాలని, దానిని సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరచాలని సలహా ఇచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశ్వసనీయత అనేది పరీక్షలు, మార్కుల విధానంపై ఆధారపడుతుందని చెప్పారు. పరీక్షల మూల్యాంకనంలో ఎక్కువ సమయం తీసుకోకూడదన్నారు. టీఎస్‌పీఎస్సీ అమలులోకి తీసుకువచ్చిన వన్‌టైం రిజిస్ట్రేషన్ విధానం బాగుందని మెచ్చుకున్న నరసింహన్, ఆ సేవలను మోబైల్ ద్వారా అందిస్తే ఇంకా బాగుంటుందని సలహా ఇచ్చారు.

ఉద్యోగాల భర్తీకి సిద్ధం: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ చక్రపాణి


ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. నెలాఖరులోగా వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని చెప్పారు. ఈ నెల 14న డిపార్టుమెంటల్ పరీక్ష, ఐఏఎస్, ఐపీఎస్ వంటి హాఫ్‌ఇయర్లీ పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు. నిరుద్యోగులకు ఉపయోగకారిగా ఉండే విధంగా వెబ్‌సైట్ డిజైన్ చేయించామని ఆయన తెలిపారు. 

ఇందులో నిరుద్యోగులు వన్‌టైం పాస్‌వర్డ్ విధానం ద్వారా ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకొంటే ఉద్యోగాల భర్తీ సమాచారం గురించి ఎప్పటికప్పుడు మోబైల్ ద్వారా చేరవేస్తామని తెలిపారు. యూపీఎస్సీ, ఇతర రాష్ర్టాల వెబ్‌సైట్లు పరిశీలించి టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. కేరళ రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ అవుతున్నాయన్నారు. ముంపు ప్రాంతాలలో ఉన్న ఏడు మండలాలకు చెందిన అభ్యర్థులు కూడా టీఎస్‌పీఎస్సీకి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. రాత పరీక్షల సిలబస్‌పై ప్రభుత్వం నుంచి ఇక అనుమతి రావాల్సి ఉందన్నారు. వెబ్‌సైట్, లోగో ఆవిష్కరించిన గవర్నర్, వన్‌టైం పాస్‌వర్డు ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌కు, కమిషన్ సభ్యులు సీ విఠల్ ధన్యవాదాలు తెలియజేశారు.
Source: www.namasthetelangaana.com

1 comment:

  1. it is very usefull information you have given here sir please provide telangana water gride recruitment process details

    Telangana water grid recruitment

    ReplyDelete