Sunday, March 15, 2015

రెండేండ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం - ముఖ్యమంత్రి కేసీఆర్



-రెండేండ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం
-ఇప్పటికే ఐదువేల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం
-విద్యుత్ శాఖలో మరో 20 వేల ఉద్యోగాలు

వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని సీఎం యువతకు తీపి కబురు వినిపించారు. ఇప్పటికే పోలీసు శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఐదువేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని, ఇక ఒకటి వెంట ఒకటిగా నోటిఫికేషన్లు వస్తాయని శాసనమండలిలో సభ్యుల హర్షధ్వానాల మధ్య కేసీఆర్ ప్రకటించారు. 

రెండేళ్లల్లో లక్ష ఉద్యోగాలు ఖాయం


రానున్న రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. కమలనాథన్ కమిటీ నివేదిక వస్తే ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయనే విషయమై అవగాహన వస్తుందని, ఆ మేరకు భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికే కొత్త విద్యుత్ ప్రాజెక్టుల్లో 20 వేల మంది, ఆర్‌డబ్ల్యూఎస్, పోలీస్ డిపార్ట్‌మెంటులో సుమారు 13వేల వరకు ఖాళీలను గుర్తించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ప్రతిపాదనలు పంపించామని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే ఉర్దూ టీచర్లు, లెక్చరర్ పోస్టులు పది నుంచి 15 వేల వరకు భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగుల వయోపరిమితి ఐదేండ్లే కాదు అందరు అంగీకరిస్తే పదేండ్ల సడలింపు ఇవ్వడానికి కూడా అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. దీని విషయంపై అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. డీఎస్సీ విషయం ప్రస్తావిస్తూ రాష్ట్రం లో ఇప్పటికే పంతుళ్లు ఉన్న చోట, పిల్లలు లేరు, పిల్లలు ఉన్న చోట పంతులు లేని పరిస్థితి నెలకొందన్నారు. కేవలం ఉద్యోగాల భర్తీ కోసమే డీఎస్సీ నిర్వహించకూడదన్నారు. టీచర్ల క్రమబద్ధీకరణ తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. 


No comments:

Post a Comment