Saturday, January 3, 2015

పరీక్షా ప్రణాళికకు వారంలో కమిటీ

-కమిటీ నివేదిక ఆధారంగా జీవో
-సబ్జెక్టులవారీగా సిలబస్ కమిటీలు
-వేగం పుంజుకున్న టీఎస్‌పీఎస్సీ
-కమిషన్‌కు బడ్జెట్, సిబ్బంది కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ


హైదరాబాద్, జనవరి 2 (టీ మీడియా):తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక ప్రధాన నినాదమైన నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే ఈ దిశగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చైర్మన్‌గా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కమిషన్‌కు అవసరమైన 121 పోస్టులు మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి ముందురోజే గురువారం కమిషన్‌కు ఈ ఆర్థిక సంవత్సరం మూడు నెలల కాలానికి ఏడు కోట్లకుపైగా బడ్జెట్ కూడా కేటాయించింది. 

నిరుద్యోగుల పక్షాన నిలబడే మేధావులు, నాయకులే సభ్యులుగా ఉన్న కమిషన్.. వీలైనంత త్వరగా నియామకాల ప్రక్రియను మొదలుపెట్టేందుకు క్షేత్రస్థాయి ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నది. కమలనాథన్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతగానీ రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఖాళీలెన్ని? అన్న అంశంపై స్పష్టత వస్తుంది. దీంతో ఈలోపు ఇతర కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగానే పరీక్షా ప్రణాళిక (ఎగ్జామినేషన్ స్కీం)ను తయారు చేసేందుకు కమిటీ నియామకంపై కసరత్తు జరుగుతున్నది. వారంలో దీనిపై నిర్ణయం వెలువడుతుందని సమాచారం. ఈ కమిటీ అధ్యయనం చేసిన అనంతరం సమర్పించే నివేదిక ఆధారంగా ప్రభుత్వం పరీక్షా ప్రణాళికపై జీవో జారీ చేస్తుంది.

అనంతర ప్రక్రియలో సిలబస్‌పై నిపుణుల కమిటీని ఏర్పాటుచేస్తారు. ఉద్యోగుల విభజన పూర్తయ్యేనాటికి పరీక్షాప్రణాళిక, సిలబస్ స్కీం పూర్తయితేనే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగుల విభజన పూర్తయిన తర్వాతే ఏ కేటగిరీలో ఎంత మంది ఉద్యోగులు అవసరమవుతారో నిర్ధారణ అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీనితోపాటే జోనల్ విధానాన్ని కొనసాగించాలా? వద్దా? అనేదానిపైనా నిర్ణయం జరుగాల్సి ఉంది.


ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఏ హోదాలో ఎంత మందిని రిక్రూట్ చేయాలి? అనే అంశాలపై ప్రభుత్వం కమిషన్‌కు నివేదిక ఇచ్చిన తర్వాతే నియామకాల ప్రక్రియ మొదలవుతుంది. ఇదంతా జరుగడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపే పరీక్షా ప్రణాళిక, సిలబస్ రూపకల్పన అంశాలను కొలిక్కి తేవాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నది.

పరీక్షల్లో ఏపీ చరిత్రకు చెల్లు చీటీ


సిలబస్ రూపొందించడానికి ముందు పరీక్షా ప్రణాళిక ఖరారు కావాల్సి ఉంది. ఇక్కడ పలు కీలక అంశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఏపీపీఎస్పీని ఏలిన సీమాంధ్రులు.. ప్రశ్నాపత్రాలను ఏపీ చరిత్ర ప్రశ్నలతో నింపేశారు. ఉదాహరణకు ప్రస్తుతం ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రశ్నాపత్రాల్లో ఏపీ చరిత్రపైనే 200 మార్కులకు ఉంటాయి. గ్రూప్-1లో కూడా 50శాతం మార్కులు ఏపీ చరిత్రపైనే ఉంటాయి. ఇందులో తెలంగాణ ప్రాంత విశేషాలపై ప్రశ్నలు ఎక్కడోకానీ కనిపించవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయి.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నేపథ్యంలో ఈ విధానాన్ని మార్చివేయాలని భావిస్తున్న టీఎస్‌పీఎస్సీ.. తెలంగాణ చరిత్రకు సంబంధించి 200 మార్కులకు ప్రశ్నాపత్రం తయారు చేయాలని సంకల్పిస్తున్నది. దీనిని నిర్ధారించేందుకు సిలబస్ కమిటీలు వేయనున్నారు.

సిలబస్‌పై వారంలో నిపుణుల కమిటీ


సిలబస్‌కు సంబంధించిన ప్రణాళికను రూపొందించడానికి వారంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ), ఏపీపీఎస్సీ సిలబస్ స్కీమ్‌ను రూపొందించిన నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కొంత మంది నిపుణుల పేర్లు ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ కమిటీ స్కీమ్‌ను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను సమీక్షించి జీవో జారీ చేస్తుంది. ఈ స్కీమ్ ప్రాతిపదికగా సిలబస్‌ను రూపొందిస్తారు. ఈ జీవో వచ్చిన తరువాతనే సబ్జెక్టుల వారిగా నిపుణులతో కమిటీలు వేసి సిలబస్ రూపొందిస్తారు.

నిరుద్యోగుల ఆందోళనల వెనుక సీమాంధ్రుల కుట్ర!


సొంత రాష్ట్రంలో ఉద్యోగాల కోసం అనేక మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వారు రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడింది ఇందుకోసమే. అయితే.. నియామకాల ప్రక్రియ ఆలస్యం అవుతున్నది. ఇందుకు కారణం జగద్విదితమే. ఉమ్మడి రాష్ట్ర ఉద్యోగులను విభజించేందుకు కమలనాథన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన పని పూర్తి చేయడానికి మీనమేషాలు లెక్కపెడుతున్నది. 

వాస్తవానికి కమలనాథన్ పని పూర్తయిన తర్వాతే ఎన్ని ఖాళీలున్నాయి? అనేది తేలుతుంది. దాని ప్రకారం కొత్త ఉద్యోగాల నియామకానికి మార్గం సుగమం అవుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తించడానికి నిరాకరిస్తున్న తెలంగాణ వ్యతిరేక మీడియా.. అభూత కల్పనలతో కొందరు నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనను ఇంకా జీర్ణించుకోలేక పోతున్న సీమాంధ్ర బడాబాబులు తమ ఏజెంట్లను రంగంలోకి దించి.. ఆందోళనలు చేయిస్తున్నారని తెలుస్తున్నది.

వారి ప్రోద్బలంతోనే ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగిన సీమాంధ్ర మీడియా.. రాష్ట్రం వచ్చి ఆరు నెలలైనా ఇంత వరకూ ఉద్యోగ నియామకాలు లేవంటూ అహేతుకమైన కథనాలు రాస్తున్నదని అంటున్నారు. ఇక్కడ నానా యాగీ చేస్తున్న, చేయిస్తున్న సీమాంధ్ర దొరబాబులు.. ఆంధ్రలో అక్కడి సీఎం చంద్రబాబు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నియామక ప్రకటన చేయని విషయాన్ని మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదని విమర్శిస్తున్నారు. సిలబస్ మార్పుపైనా కుట్రపూరితంగానే ఆందోళన రెచ్చగొడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పరీక్షల సిలబస్‌ను మారిస్తే.. తమ కోచింగ్ సెంటర్లు మూతపడతాయనేది వారి బాధ అని పలువురు విద్యార్థి నేతలు అంటున్నారు. కేవలం తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని భావించే.. సిలబస్ మార్చవద్దని కొందరిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని వారు మండిపడుతున్నారు.

టీఎస్‌పీఎస్సీకి 121 పోస్టులు


తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి రాష్ట్ర ప్రభుత్వం 121 పోస్టులు మం జూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ జీవో విడుదల చేసింది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఏస్‌సీ నుంచి అదే కేడర్‌లో కొనసాగుతున్న వారిని తీసుకోవాలని జీవోలో తెలిపారు. జీవో జారీ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీలో త్వరలోనే సెక్షన్ల ఏర్పాటు కానున్నాయి. ఇందుకు తెలంగాణ ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాల్సిందిగా ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేయనున్నారు.

Source: Namasthetelangana.com, Eenadu epaper

No comments:

Post a Comment