Saturday, January 3, 2015

త్వరలోనే అటవీశాఖలో ఉద్యోగ నియామకాలు

-జూనియర్ ఫారెస్ట్ అధికారుల డైరీ ఆవిష్కరణలో మంత్రి జోగు రామన్న
హైదరాబాద్, జనవరి 2 (టీ మీడియా): అటవీ శాఖలో త్వరలోనే ఉద్యోగ ఖాళీల భర్తీ చేపడుతామని.. ఈ విషయంపై దృష్టి సారించామని బీసీ సంక్షేమ, అటవీ, పర్యావరణ మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో పక్కా ప్రణాళికలతో అభివృద్ధి సాధించాలని అధికారులకు సూచించారు. జూనియర్ ఫారెస్ట్ అధికారుల సంఘం నూతన సంవత్సర డైరీని ఆయన సచివాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనకు తెలుసునని.. సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి వరకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం మేరకు బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కే నాగేందర్‌బాబు, అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు మొజం అలీఖాన్, ప్రభాకర్‌రావు, రాఘవేందర్‌రావు, జోహార్, వెంకటయ్యగౌడ్ పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎస్‌బీఎల్ మిశ్రా, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ పీకే శర్మ, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కే అలోక్‌కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్యభట్టు మంత్రి జోగురామన్నను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


No comments:

Post a Comment