Tuesday, December 16, 2014

నూతన మంత్రులుగా ఆరుగురు ప్రమాణం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రి వర్గ విస్తరణ ఇవాళ ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగింది. కొత్త మంత్రుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. పూర్తి స్థాయి మంత్రివర్గంతో ముందుకు వెళ్లాలని భావించిన సీఎం కేసీఆర్ కల నెరివేరింది. ముఖ్యమంత్రితో సహా కొత్త మంత్రులతో మంత్రుల సంఖ్య 18కి చేరింది. కొత్తగా కొల్లాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, జడ్చర్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే చందులాల్, టీడీపీ నుంచి ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన మంత్రులకు ఈ సాయంత్రం శాఖలు చేటాయించే అవకాశం ఉంది. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, జోగు రామన్న, నాయిని నర్సింహారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.

జూపల్లి ప్రస్థానం.. బ్యాంక్ ఉద్యోగి నుంచి మంత్రి దాకా

telangana cabinet expansion at Rajbhavan


జూపల్లి కృష్ణారావు తన రాజకీయ ప్రస్థానాన్ని బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రారంభించారు. ఆయన రాజకీయాల్లోకి 1981లో వచ్చారు. 1999 నుంచి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగిన ఆయన కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 5,305 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
2004న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 3,041 ఓట్ల మెజార్టీతో రెండవసారి విజయ దుందుభి మోగించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 1508 ఓట్లతో ముచ్చటగా మూడో సారి గెలిచి వైఎస్ కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011 మార్చి 3న మంత్రి పదవికి రాజీనామా చేసి.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2011 ఏప్రిల్ 28న జిల్లా కేంద్రం నుంచి జూపల్లి ప్రజాభియాన్ యాత్ర చేపట్టారు. మే 31న దేవాదాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం అధిష్టానంపై ఒత్తిడి కోసం 2011 అక్టోబర్ 12న తొలిసారిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2011 అక్టోబర్ 30న కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2012 మార్చి 18న జరిగిన కొల్లాపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 15 వేల 23 ఓట్ల మెజార్టీతో నాలుగవ సారి ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా 10,498 ఓట్లతో ఐదో సారి విజయం సాధించారు.
కృష్ణారావు స్వస్థలం : పెద్దదగడ గ్రామం, వీపనగండ్ల మండలం, కొల్లాపూర్ తాలుకా. బీఏ చదివారు. 1955 ఆగస్టు 10న జన్మించారు. ఇద్దరు కుమారులు వరుణ్, అరుణ్. తల్లిదండ్రులు రత్నమ్మ, శేషగిరిరావు.

ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి సర్పంచ్ నుంచి మంత్రిస్థాయి దాకా

telangana cabinet expansion at Rajbhavanజడ్చర్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి సర్పంచ్ నుంచి మంత్రిస్థాయి దాకా ఎదిగారు. 1988లో అవంచ గ్రామ సర్పంచ్‌గా ఎన్నిక(టీడీపీ మద్దతుదారుడిగా) అయ్యారు. అనంతరం తిమ్మాజిపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పని చేశారు. 1995లో తిమ్మాజిపేట సింగిల్‌విండక్ష అధ్యక్షులుగా ఎన్నిక. 1996లో జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియామకం అయ్యారు. 1999లో స్వతంత్ర అభ్యర్థిగా జడ్చర్ల నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2001లో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2004 -2008లో జడ్చర్ల ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు. 2008లో కేసీఆర్ పిలుపుతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2014లో టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. లకా్ష్మరెడ్డి స్వస్థలం అవంచ గ్రామం, తిమ్మాజిపేట మండలం, మహబూబ్‌నగర్ జిల్లా. విద్యార్హత బీహెచ్‌ఎంఎస్(గుల్బర్గ), కూతరు స్పూర్తి, కుమారుడు స్వరణ్. 1962 ఫిబ్రవరి 2న జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, నారాయణరెడ్డి.

అలోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి

telangana cabinet expansion at Rajbhavan


అలోల్ల సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న వ్యక్తి. సుమారు మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో వివిధ పదవులను అనుభవించిన ఆయన ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పలు సందర్భాల్లో అలోల్లకు మంత్రి పదవి వచ్చినట్లే వచ్చి చేజారింది. 1999లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మూడు సార్లు జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి చేజారింది. 2009లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ నిర్మల్‌లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో అల్లోల ఓటమి పాలవ్వడం ఆయనను తీవ్రంగా కుంగదీసింది.2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నుంచి టికెట్లు దక్కకపోవడంతో ఆయన బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి అనుహ్యంగా గెలిచారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు.

మంత్రిగా ములుగు ఎమ్మెల్యే చందులాల్

telangana cabinet expansion at Rajbhavan


ములుగు ఎమ్మెల్యే చందులాల్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల హైదరాబాద్ బంజారాభవన్, ఆదివాసీ భవన్ల ప్రారంభోత్సవం సందర్భంగా స్వయంగా సీఎం కేసీఆరే ఈ సారి గిరిజనులకు మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా చోటు లభిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. గిరిజన సంక్షేమ శాఖను కచ్చితంగా గిరిజనులే నిర్వహిస్తారని సీఎం ప్రకటించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు మంత్రివర్గంలో చందూలాల్ కేసీఆర్‌తో కలిసి పని చేశారు. గిరిజన శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. లాల్ ట్రైకార్ చైర్మన్‌గా పని చేశారు. గిరిజన సమస్యలపై మంచి అవగాహన ఉన్న నేతగా గుర్తింపు ఉంది. అంతే కాకుండా చాలా కాలం కేసీఆర్‌తో పాటే టీడీపీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పని చేశారు. మొదటి నుంచి ఇద్దరి మధ్య సత్ససంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత 2004లో పార్లమెంట్ ఎన్నికల్లోనే వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానని పిలిచారు. 2009 ఎన్నికల్లో ములుగు నుంచి టికెట్ ఆశించగా అక్కడి పరిస్థితులు టీడీపీ అనుకూలంగా ఉన్నాయని మహబూబాబాద్ నుంచి పోటీ చేయాలని సూచించారు. ఎంపీ పోటీ చేయాలని భావించినప్పటికీ పొత్తులో భాగంగా ఎంపీ స్థానం టీడీపీ వెళ్లింది. దీంతో మహబూబాబాద్ నుంచి టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. చందులాల్ ఓడిపోయిన సందర్భంలో కూడా కేసీఆర్ వెన్నుతట్టి మంచి రోజులు వస్తాయనే భరోసా ఇచ్చారు. 2014 ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి చందులాల్ గెలుపొందారు. అయితే మొదటి మంత్రి వర్గంలోనే మంత్రి పదవి వస్తుందని భావించినప్పటికీ రాలేదు. తొలి మంత్రి వర్గ విస్తరణలో చందులాల్‌కు మంత్రి పదవి వరించింది.

మంత్రిగా తుమ్మల

telangana cabinet expansion at Rajbhavan


తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. టీడీపీలో ఒక మంచి పేరున్న నేతగా ముద్ర వేసుకున్నారు. టీడీపీ అధ్యక్షుడు తీరు నచ్చక ఇటీవలే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయనకు సీఎం కేసీఆర్ గౌరవంతో మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తుమ్మల మంత్రిగా పని చేసి తన సమర్థతను నిరూపించుకున్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం. తుమ్మల సమర్థతను గుర్తించిన కేసీఆర్ జిల్లాలో పార్టీ బాధ్యతలను తుమ్మల భుజస్కందాలపై పెట్టారు. అయితే తుమ్మలది సత్తుపల్లి నియోజకవర్గం. అక్కడి నుంచే ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. టీడీపీ స్థాపించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లోనే తుమ్మల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడే తుమ్మలకు ఎన్టీఆర్ కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్న తరహా నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 1994, 1999 ఎన్నికల్లో గెలిచిన తుమ్మల చంద్రబాబు మంత్రివర్గంలో కీలకమైన ఎక్సైజ్, భారీ నీటిపారుదల, ఆర్ అండ్ బీ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 2004 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఆగస్టు 30న టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు.

మంత్రిగా ప్రమాణం చేసిన తలసాని

telangana cabinet expansion at Rajbhavan


రాజకీయ నేపథ్యం: నాలుగు పర్యాయాలు సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2000, 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 27, 371 ఓట్ల మెజార్టీతో తన సమీప టీఆర్‌ఎస్ ప్రత్యర్ధి దండె విఠల్‌పై గెలుపొందారు. ఐతే ఇటీవలే టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. శ్రీనివాస్‌యాదవ్ చేరికతో మంత్రివర్గంలో నగర ప్రాతినిథ్యం నాలుగుకు చేరనుంది. 

No comments:

Post a Comment