Monday, November 24, 2014

నిరుద్యోగులకు వయో పరిమితి సడలింపు: సీఎం

హైదరాబాద్ : తెలంగాణలోని నిరుద్యోగులకు వయో పరిమితి సడలింపు ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నిరుద్యోగంపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నిరుద్యోగులకు 5 ఏండ్లు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి రిక్రూట్‌మెంట్స్ చేపడుతామని తేల్చిచెప్పారు. త్వరలోనే టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాటు నోటిఫికేషన్ వెలువడుతదని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందన్నారు. తెలంగాణలో 1,07,744 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.

నిరుద్యోగ యువత ఎలాంటి నిరాశకు లోను కావొద్దని కోరారు. వచ్చే నాలుగైదు మాసాలలో ఉద్యోగ నియామకాలు చేపడుతామని పేర్కొన్నారు. ఉద్యోగుల సంఖ్య, సంస్థల సంఖ్య తేలకపోవడంతో సందిగ్ధత నెలకొని ఉందన్నారు. కమల్‌నాథన్ కమిటీని ఉద్యోగుల విభజన చేపడితే ఎంత మంది పోతారో.. ఎంత మంది ఉంటారో తెలుస్తది.. అప్పుడు ఎన్ని ఖాళీలున్నాయో తెలుస్తది అని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. విద్యుత్ రంగంలో భారీగా ఉద్యోగాలు వస్తాయన్నారు.

కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల విభజన జరిగిన తర్వాతే ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. ఒకప్పుడు ప్రభుత్వం రంగంలోనే ఉద్యోగాలు ఉండేవి.. ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాలు వచ్చాయని సీఎం పేర్కొన్నారు.

No comments:

Post a Comment