Friday, September 5, 2014

మాతో మాట్లాడితే మీకేం లాభం: మోడీతో విద్యార్థి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. విద్యార్థుల ప్రశ్నలకు మోడీ సమాధానాలు ఇలా.. 
విద్యార్థి: మీరే ఉపాధ్యాయుడు అయితే ఎవరి మీద దృష్టి పెడతారు? తెలివిగల వాడై సోమరిగా ఉండే విద్యార్థి మీదనా? లేక కష్టపడి చదివే సగటు విద్యార్థి పైనా? 
మోడీ: తల్లికి పిల్లల్లాగే.. ఉపాధ్యాయులకి పిల్లలందరూ సమానం. వివక్ష అనేది ఉండకూడదు. అందరిలోను మంచి గుణాలు తెలుసుకొని ప్రోత్సహించాలి. బలహీనతలను అధిగమించేందుకు తోడ్పడాలి. నేను టీచర్ను అయితే అందరినీ సమానంగా చూస్తాను.విద్యార్థి: మాతో మాట్లాడితే మీకు లాభం ఏమిటి?
 మోడీ: అన్ని పనులు లాభం కోసం చేయం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం కలిగించింది. బ్యాటరీ చార్జ్ అయింది. ఈ కార్యక్రమం వల్ల టెలివిజన్ చానళ్లు ఈ రోజు తమ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి పిల్లల్ని టీవీల్లో చూపిస్తున్నారు. మీ మొహాలు చూసి మొహం మొత్తిన ప్రజలకు ఇది ఎంత రిలీఫ్‌గా ఉంటుంది. 


విద్యార్థి: పర్యావరణం, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు కారణం ఏమిటి? 
మోడీ: మన అలవాట్లలో వచ్చిన మార్పుల వల్ల వాటిలో మార్పులు వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు తోడ్పాటునివ్వాలి. ఒకప్పుడు మనం ఎంతో పర్యావరణహితంగా జీవించాం. 
విద్యార్థి: సేవ చేయాలంటే రాజకీయాలే మార్గమా? 
మోడీ: దేశ సేవకు రాజకీయాలు ఒకానొక సాధనం మాత్రమే. మనం చేసే చిన్న చిన్న మంచి పనులు కూడా దేశ సేవగా భావించాలి. రాజకీయాలను ఒక వృత్తిగా చూడకూడదు. దేశసేవగా భావించాలి. మిలటరీలోనో, రాజకీయాల్లోనో చేరితేనే సేవ చేసినట్లు కాదు. మనం పాటించే శుభ్రత మన వ్యక్తిత్వ నిర్మాణంలో భాగం అవుతుంది. భారతీయులు నా కుటుంబ సభ్యులు. వారి సంతోషాలు, బాధలు నావిగా భావిస్తాను. నా కుటుంబ సభ్యుల్లాంటి ప్రజల కోసం మరింత ఎక్కువగా పని చేస్తాను. దేశాన్ని డిజిటల్ ఇండియాగా మారుస్తాం. అన్ని భాషల్లో సాంకేతిక విద్యను అభివృద్ధి చేస్తాం. విద్యార్థులు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. హాస్య పుస్తకాలు అయినా చదవాలి. 
విద్యార్థి: ఎప్పుడైనా ప్రధాని అవుతారని ఊహించారా? 
మోడీ: నేను క్లాస్ లీడర్‌గా ఎప్పుడు పోటీ చేయలేదు. పాఠశాల ఎన్నికలలోను పోటీ చేయలేదు. ప్రధానిని అవుతానని ఎప్పుడు అనుకోలేదు. 
విద్యార్థి: మీరు ప్రధాని ఎలా కాగలిగారు? 
మోడీ: భారత దేశం ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా ప్రధాని అయ్యేందుకుఅవకాశముంది. మీలో భవిష్యత్తలో ఎవరైనా ప్రధానమంత్రి అయితే ప్రమాణ స్వీకారానికి నన్ను పిలవండి. 
విద్యార్థి: అహ్మదాబాద్ నుండి వచ్చినందుకు అనుభూతి ఎలా ఉంది? 
మోడీ: నాకు ఇల్లు, కార్యాలయం మధ్యనే సమయం గడిచిపోతోంది. ఢిల్లీని చూడలేకపోతున్నాను. విద్యార్థులు, ఉపాధ్యాయులు దేశ ప్రగతి కోసం పని చేయాలి. గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలాకాలం పని చేసిన అనుభవం ఉపయోగపడుతోంది. నేను మాట్లాడుతున్నది ఏమిటనేది ప్రధాని అయ్యాక మరింత స్పృహతో మాట్లాడుతున్నాను. 
విద్యార్థి: చదువుకునే రోజుల్లో మీరు అల్లరి చేసేవారా? 
మోడీ: నేను చదువుకునే రోజుల్లో తుంటరి పనులు చేసేవాడిని. బాల్యం చాలా మధురమైనది. అది జీవితకాలంలో చాలాకాలం ఉండాలి. కానీ ఇప్పటి పిల్లలు ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. నేను అల్లరి చేశాను. ఎక్కడైనా పెళ్లవుతుంటే వెళ్లేవాళ్లం. అక్కడ వాళ్లు షహనాయి వాయిస్తే మేం చింతకాయ చూపించే వాళ్లం. నోట్లో నీళ్లూరితే ఇంక వాళ్లే వాయిస్తారు. కొన్నిసార్లు వివాహానికి వచ్చిన అతిథుల దుస్తులు కలుపుతూ పిన్నులు కుట్టేవాళ్లం. తెలియక వారు చెరో పక్కకు వెళ్తే ఏం జరుగుతుందో మీకు తెలుసుగా.
విద్యార్థి: నేను ప్రధానిని కావాలంటే ఎలా? 
మోడీ: 2024 ఎన్నికలకు సమాయత్తం కావాలి. సదరు విద్యార్థికి మోడీ నవ్వుతూ సమాధానమిచ్చారు.
విద్యార్థి: మీరు హెడ్మాస్టర్ లాంటి వారని అందరు అంటుంటారు. కానీ అప్యాయంగా మాట్లాడుతున్నారు? 
మోడీ: నేను నిజంగానే పని చేయించేవాడిని. అయితే, మొదట నేను పని చేసి, ఇతరులను అడుగుతాను. నేనెవరో నాకు తెలియదు. నాకే కాదు ప్రతి మనిషికీ తానెవరో తెలియదు. మనమెవరిమో తెలిస్తే మన జీవితాలు అంతమయిపోతాయి. నేను హెడ్మాస్టర్ అని మీరు అంటున్నారు. నేను టాస్క్ మాస్టర్‌ని. 
విద్యార్థి: దేశానికి ఏదైనా మంచి సేవ చేయాలనుంది, ఏం చేయాలి? 
మోడీ: మొదటి నుండి మిమ్మల్ని మీరు మలచుకోండి. అదే గొప్ప సేవ.

Source:: http://telugu.oneindia.in/

No comments:

Post a Comment