Thursday, August 7, 2014

Telangana News 07-08-14గోల్కొండ కోటలోనే పంద్రాగస్టు వేడుకలు
 పంద్రాగస్టు వేడుకలు గోల్కొండ కోటలోనే జరుగుతాయని డీజీపీ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. రక్షణ శాఖతో ఉన్న వివాదం త్వరలోనే కొలిక్కి వస్తుందని చెప్పారు. పంద్రాగస్టు వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయని తెలిపారు. 

మెట్రో టెస్టు ట్రయల్ నిర్వహించిన అధికారులు
నగరంలో ఇవాళ అధికారులు మెట్రో టెస్టు ట్రయల్‌ను నిర్వహించారు. మెట్రోరైలు తొలిసారి ప్రయోగాత్మకంగా పరీక్షల కోసం ట్రాక్‌పైకి వచ్చింది. మెట్రో అధికారులు నాగోలు మెట్రో డిపో నుంచి సర్వే ఆఫ్ ఇండియా వరకు ట్రయల్ చెక్ నిర్వహించారు. కిలోమీటర్ వరకు రైల్వే ట్రాక్, కోచ్‌ల పనితీరును అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. 

అధికారులు చొరవ తీసుకొని పనిచేయాలి: సీఎం
నిజామాబాద్: ప్రజలకు ఉపయోగపడేదేదైనా ఉద్యోగులు చొరవ తీసుకొని ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు సూచించారు. నిజామాబాద్‌లో జరిగిన సమిక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ... ఉద్యోగుల కాళ్లు, చేతులు కట్టేసే ప్రభుత్వం తమదికాదని, ఉద్యోగి ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా ఉంటామన్నారు. ఈ విషయం ఇదివరకే ప్రకటించామని పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పిందే చేయాలి, చెబుతేనే చేయాలని ఉండకుండా ప్రజలకు మంచి జరిగేది ఏదైన కార్యక్రమం ఉంటే ప్రత్యేక చొరవ తీసుకొని అధికారులకు ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను ఉదాహరణగా చెబుతూ.. స్మితా సబర్వాల్ కరీంనగర్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఔవర్ టౌన్ అనే ఒక కొత్త కార్యక్రమం చేపట్టి నగరంలోని రోడ్లను వెడల్పు చేసి ప్రజారవాణా వ్యవస్థ మెరుగుకు కృషిచేశారు. అదేవిధంగా మెదక్ జిల్లాలో విధులు నిర్వహించినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి సేవల మెరుగుదలకు పాటుపడ్డారు. ఇలా అధికారులు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను తమ చొరవతో చేపట్టి విజయవంతం చేయాలన్నారు.   

సర్వేనాడు ఇంట్లో లేనివారు లెక్కల్లో లేనట్లే:సీఎం
ఈ నెల 19న చేపట్టే సర్వేనాడు ఇంట్లో లేనివారు ప్రభుత్వ లెక్కల్లో లేనట్లేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ నిజామాబాద్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ 19న ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం చాలా కీలకమైందని అన్నారు. ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేకుంటే అక్రమాలు జరుగుతాయని తెలిపారు. సర్వే గురించి విస్తృత ప్రచారం చేయాలని సీఎం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కుటుంబాల సంఖ్య కన్నా రేషన్‌కార్డులు ఎక్కువ ఉండటం సిగ్గు చేటని అన్నారు. తెల్ల రేషన్‌కార్డు సర్వ జబ్బుల మయమైపోయిందని తెలిపారు. ఫీజు రియింబర్స్‌మెంట్ పథకంలో అన్నీ అక్రమాలే చోటు చేసుకున్నాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంపై రూ.1300 కోట్ల బకాయిలను రుద్దుతున్నారని, వేల కోట్ల నిధులు ఏమైనయో దేవుడికే తెలియాలన్నారు.   నీటి పథకాన్ని ఏడాదిలో పూర్తి చేస్తాం: సీఎం
ఆర్మూర్ ప్రజలకు రూ. 114 కోట్లతో మంచినీటి పథకం ఏడాది లోపల పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సిద్ధిల గుట్ట, పులిగుట్టలపై నీటి ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నీటి పంపులు లేకుండానే 3 అంతస్థుల బిల్డింగ్‌లపైకి నీళ్లు వస్తాయని చెప్పారు. ఏడాది తర్వాత ఆర్మూర్‌కు మళ్లీ నేనే వచ్చి నల్లా విప్పి నీళ్లందిస్తానని తెలిపారు.   

తెలంగాణలో కౌన్సెలింగ్ వాయిదా
గురువారంనుంచి ప్రారంభం కావాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను తెలంగాణ రాష్ట్రంలో వాయిదా వేశామని ఏపీ ఉన్నతవిద్యా మండలి చైర్మన్ ఎల్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఏపీలో గురువారం కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పుపై చర్చించేందుకు బుధవారం అడ్మిషన్ల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో వేణుగోపాల్‌రెడ్డితో పాటు రెండు రాష్ర్టాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు, ఇద్దరు కన్వీనర్లు, ఇద్దరు కో కన్వీనర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గురువారం నుంచి కౌన్సెలింగ్ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. సుప్రీంకోర్టు నుంచి తుది తీర్పు వెలువడిన తర్వాతే తాము ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించుకునే అంశంపై సంపూర్ణ నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. వేణుగోపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుంచి సర్టిఫికెట్ట పరిశీలన జరుపటంలేదని తెలిపారు. రాష్ట్రంలోని 23 కౌన్సెలింగ్ కేంద్రాల్లో కౌన్సెలింగ్‌కు సంబంధించిన ఎలాంటి పనులు ప్రారంభం కావన్నారు. తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ లెక్చరర్లు సహకరించకపోవటంతో వెరిఫికేషన్ ప్రక్రియ వాయిదా వేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు తిరిగి నెల 10 లోపు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. రెండు రాష్ర్టాల్లో ఈ నెల 23లోగా ఇంజినీరింగ్ అడ్మిషన్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.    

No comments:

Post a Comment