Friday, August 15, 2014

రైతులు, కార్మికులే దేశ నిర్మాతలు: ప్రధాని మోడీ

రైతులు, కార్మికులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలే దేశ నిర్మాతలు అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఢిల్లీ ఎర్రకోటపై మోడీ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. మోడీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానిగా కాదు ప్రధాన సేవకుడిగా మీ ముందుకొచ్చా. ప్రధానిగా కాదు ప్రధాన సేవకుడిగా మీ ముందుకొచ్చా. స్వాతంత్రం కోసం పోరాడిన వారిని ఇవాళ స్మరించుకోవాలి. స్వాతంత్ర స్ఫూర్తితో దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళదాం. 


దేశాభివృద్ధికి పాల్పడదాం
ఐకమత్యంగా దేశాభివృద్ధికి పాల్పడుదాం. కలిసి నడుద్దాం.. కలిసి ఆలోచిద్దాం.. కలిసి ముందుకు నడుద్దాం.. అన్ని పార్టీలు కలిసి నడిచి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. పార్టీల కన్నా దేశమే మిన్న.. దేశం కోసం కలిసి పని చేద్దాం. ఒక విభాగానికి వ్యతిరేకంగా మరో విభాగం పోరాడితే దేశం ముందుకెళా వెళ్తుంది. దేశ ప్రగతికి ప్రధాన మంత్రులు, అన్ని ప్రభుత్వాలు కృషి చేశాయి. సమష్టి ఆలోచనతో ఐకమత్యంగా దేశాభివృద్ధికి పాటుపడదాం. అనుక్షణం నా దేశ ప్రజల సేవలో భాగస్వామ్యం కావాలనేదే నా ఆశయం. దేశ హితం కోసమే నా అహరహం పని చేస్తా. దేశాభివృద్ధి మన బాధ్యత మాత్రమే కాదు.. మన పూర్వీకుల కల. నేనేంటి.. నాకేంటి అని కాకుండా ప్రజాహితం కోసం పాటు పడాలి.

మగపిల్లలను అదుపులో పెట్టాలి
ఆడపిల్లలనే కాదు మగపిల్లలను కూడా తల్లిదండ్రులు అదుపులో పెట్టాలి. దేశంలో అత్యాచార ఘటన మనకు తలవంపులు తెస్తున్నాయి. మనం హింసను వీడి శాంతి మార్గంలో వెళ్లినప్పుడే మానవాభివృద్ధి జరుగుతుంది. ఆడపిల్లలను తల్లిదండ్రులు కళ్లల్లో పెట్టి చూసుకోవాలి. కంటి పాపకు దెబ్బ తగిలితే హృదయం విలవిలలాడదా? దేశంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేసే వారు ఉన్నారు. తల్లిదండ్రుల కోసం అవివాహితగా ఉండిపోయిన బిడ్డలూ ఉన్నారు. స్త్రీ పురుష నిష్పత్తిలో వ్యత్యాసాలు దేవుని సృష్టి కాదు.. మన పాపమే. వైద్యులకు నా విన్నపం. ఆడబిడ్డలను మాతృగర్భంలోనే చిదిమేయకండి. కులం, మతం పేరుతో సాగే హింస అభివృద్ధి నిరోధకం. కులం, మతం వదిలేద్దాం.. చేయి చేయి కలిపి ముందుకు సాగుదాం.

యువత సింహగర్జన చేయాలి
ప్రపంచ యవనికపై గుర్తింపు రావాలంటే యువత సింహగర్జన చేయాలి. మన యువత నైపుణ్య భారతాన్ని సృష్టించాలి. ఒకటి, రెండుతో సరిపోదు.. ప్రపంచ యవనికపై మనకో గుర్తింపు రావాలి. ఉద్యోగం చేయడం కాదు. ఉపాధి సృష్టి దిశగా ముందుకు సాగాలి. అభివృద్ధిలో సమతౌల్యం సాధించాలంటే తయారీ రంగం బలోపేతం కావాలి. మన ఉత్పత్తులు ప్రపంచ విపణిని ముంచెత్తాలి. ఎలక్రికల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, రసాయనాల నుంచి ఔషదాల వరకు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ కనపడాలి. తయారీ రంగంలో శక్తి సామార్థ్యాలు పూర్తిస్థాయిలో వినియోగిస్తే మనం ఎవరికీ తీసిపోం. ఐటీ నిపుణులు ప్రపంచానికి మన శక్తి ఏమిటో చూపించారు. దేశంలో అట్టడుగున్న పల్లెల్లో పిల్లలకు ఉన్నత విద్య అందించగలిగాలి. సుపరిపాలన, అభివృద్ధితో ముందుకు సాగుదాం. ఈ-గవర్నెన్స్ అంటే సుపరిపాలన, సులభ పాలన, సౌలభ్య పాలన. ప్రధాని జనధన యోజన కింద ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా, రూ. లక్ష బీమా అందజేస్తాం.

మరుగుదొడ్లు కట్టించలేని పరిస్థితికి వచ్చామా?
68 ఏళ్ల స్వతంత్య్ర భారతంలో మరుగుదొడ్లు కట్టించలేని పరిస్థితికి దేశం వచ్చిందా?. తల్లులు, చెల్లెళ్ల కోసం ఇంటికో మరుగుదొడ్డి కట్టించలేమా? ఎంతోమంది పిల్లలు మరుగుదొడ్డి లేక ఎంతోమంది ఆడపిల్లలు ప్రతి ఏడాది బడి మానేస్తున్నారు. ఇది సిగ్గుచేటు కాదా? ఇక అటువంటి పరిస్థితిని రూపుమాపేందుకు ఏడాదిలోగా అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్డు నిర్మిద్దాం. మనమంతా పరిశుద్ధ భారతం కోసం కృషిచేద్దాం.

పరిశుద్ధ భారత్ కోసం సంసద్ గ్రామ యోజన
పరిశుద్ధ భారత్ నిర్మాణం కోసం సంసద్ గ్రామ యోజన పథకాన్ని ప్రారంభింస్తాం. స్త్రీ, పురుష నిష్పత్తిలో వ్యత్యాసాలు దేవుని సృష్టి కాదు. మన పాపమే. ఈ సందర్భంగా వైద్యులకు నా విన్నపం. ఆడబిడ్డలను మాతృగర్భంలోనే చిదిమేయకండి.

No comments:

Post a Comment