Saturday, August 9, 2014

టీఎస్ పీఎస్సీ ఏర్పాటు

తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక డిమాండ్‌గా ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. టీఎస్‌పీఎస్సీ పేరిట దీనిని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నిరుద్యోగులకు మరింత తీపికబురు అందించిన ప్రభుత్వం.. గతంలో లేని విధంగా టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల నియామకాల కోసం క్యాలెండర్‌ను ప్రకటించాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వెళ్లిపోవడంతో, తెలంగాణ రాష్ర్టానికి కొత్తగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురువారం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 83 (2) ప్రకారం తెలంగాణ రాష్ర్టానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ ఏర్పాటు ప్రకటనతో ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న వేల మంది నిరుద్యోగ యువతకు ఊరట కలిగినట్లయింది. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేల ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి, వాటిని భర్తీ చేయనుంది. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు వెంటనే అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దీనిలో చైర్మన్‌గా, నలుగురు సభ్యులు ఉంటారు. కమిషన్ చైర్మన్ పదవికోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయనతోపాటు మరో నలుగురు సభ్యుల పేర్లను కూడా ఖరారు చేసిన తర్వాత పూర్తి సభ్యుల నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 


No comments:

Post a Comment