Friday, August 8, 2014

టీఎస్‌పీఎస్సీకి గవర్నర్ ఆమోదం

-రెండు రోజుల్లో జీవో!
-లక్షల ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్
-ఉద్యోగ సంఘాల హర్షాతిరేకాలు


తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటుకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం పంపిన ఫైలుపై గురువారం ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని లక్షల ఖాళీలు భర్తీ చేసేందుకు, కొత్త నియామకాలు జరుపుకొనేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలిగినట్లయింది. ఏపీపీఎస్సీకి చెందిన ఉన్నతాధికారులతో గవర్నర్ బుధవారం సమావేశమయ్యారు.

name ఈ సమావేశంలోనే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు తుది నిర్ణయం తీసుకున్నారు. సాంకేతికపరమైన అంశాలన్నింటినీ పూర్తిచేసిన తర్వాత గురువారం సాయంత్రం గవర్నర్ టీఎస్‌పీఎస్సీ ఫైలుపై సంతకం చేశారు. శుక్రవారం లేదా శనివారం ఈ విషయంలో జీవో జారీ అయ్యే అవకాశం ఉంది. జూన్ 2న కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలను స్వీకరించిన కొద్ది రోజులకే టీఎస్‌పీఎస్సీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ప్రతీ రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చని, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 83, సబ్‌క్లాజ్ (2)లో కూడా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పరచుకునేందుకు నిబంధనలు ఉన్నాయనీ, ఈ నిబంధనల ప్రకారం తమ రాష్ట్రంలో తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి వివరంగా లేఖ కూడా రాశారు. సీఎం లేఖరాసిన రెండు నెలలకు, రాష్ట్ర గవర్నర్ నుంచి అనుమతి లభించింది. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలుపడాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీ ప్రసాద్ స్వాగతించారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చూపిన చొరవ అభినందనీయమని, ఆయన కృషి ఫలితంగానే ఇంత తొందరగా టీఎస్‌పీఎస్‌సీ ఏర్పడుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయాలలో చదువుకున్న నిరుద్యోగ యువకుల ఆందోళనలకు గవర్నర్ నిర్ణయంతో సమాధానం లభించిందని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్తని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్ అన్నారు. మన రాష్ట్రంలో మన నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మార్గం సుగమమవుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవో, తెలంగాణ ఉద్యోగుల సంఘం, టీజీవోలతోపాటు అనేక సంస్థలు కీలకభూమిక పోషించాయని, ఆ ఉద్యమాల్లో ముందు వరుసలో ఉన్న నాయకులకు టీఎస్‌పీఎస్సీలో అవకాశం కల్పించాలని టీజీవో నాయకులు కోరారు.
తెలంగాణ ప్రతిభను తొక్కేసిన ఏపీపీఎస్సీ

ఏపీపీఎస్సీ గత చరిత్రను పరిశీలిస్తే అడుగడుగునా తెలంగాణకు జరిగిన అన్యాయాలు కనిపిస్తాయి. అవినీతిలో, అక్రమాలలో, తెలంగాణ ప్రతిభావంతులను తొక్కిపెట్టడంలో ఏపీపీఎస్సీ రికార్డులు నెలకొల్పిందనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ అక్రమాలు పలు దినపత్రికలలో పతాకశీర్షికలయ్యాయి. రాతపరీక్షలో టాపర్‌గా నిలిచిన వాళ్లను ఇంటర్వ్యూలలో కిందికినెట్టి, తక్కువ మార్కులు వచ్చిన వారిని టాపర్లను చేసిన చరిత్ర ఏపీపీఎస్సీకి ఉన్నదని, ఇక నుండి ఈ అక్రమాలకు పుల్‌స్టాప్ పడుతుందని టీ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షులు ఎం చంద్రశేఖర్‌గౌడ్ అభిప్రాయపడ్డారు. గతంలో రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఏపీఎన్జీవో నాయకులు సీ వెంకటరెడ్డి, టీఎన్జీవో నాయకులు సుధాకర్ ఏపీపీఎస్సీ సభ్యులుగా వ్యవహరించిన దాఖలాలు ఉన్నాయి. ఈ కోణంలోనే అక్రమార్కులను నిలువరించాలంటే తెలంగాణ ఉద్యోగసంఘాల నాయకులకు అవకాశాలు కల్పించాలనే వాదన వినిపిస్తున్నది.

నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ముఖ్యకార్యదర్శి హోదాగల సీనియర్ ఐఏఎస్ అధికారిని సెక్రటరీగా నియమిస్తారు. ప్రస్తుతం ఉన్న ఏపీపీఎస్సీ ఆస్తులన్నింటినీ రెండుగా విభజిస్తారు. ఉద్యోగులను రెండు రాష్ర్టాలకు పంపిణీ చేస్తారు. ఈ ప్రక్రియలన్నింటినీ పూర్తిచేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోని ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలను ప్రారంభిస్తారు. అవినీతి అక్రమాల విషయంలో చండశాసనుడిలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకం విషయంలో చాలా జాగ్రత్తలను తీసుకుంటారని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. 
No comments:

Post a Comment