Sunday, August 3, 2014

ఇక ఎంసెట్ నోటిఫికేషన్

-మన ఉన్నత విద్యామండలి ఏర్పాటు
-ఎంసెట్ అడ్మిషన్లకు సన్నాహాలు
-టీఎస్‌సీహెచ్‌ఈ ఆవిర్భావ ఉత్తర్వులు జారీ
-జూన్ 2 నుంచే ఏర్పాటైనట్లుగా జీవోలో స్పష్టీకరణ
-త్వరలోనే చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శి పోస్టుల భర్తీ
-సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల ప్రకటన


హైదరాబాద్, ఆగస్టు 2 (టీమీడియా): విద్యార్థులకు ఇక బేఫికర్!.. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలలో మన అడ్మిషన్లు మనమే నిర్వహించుకోవడానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) ఆవిర్భవించింది. ఈ మేరకు శనివారం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ జీవో 5 ను జారీ చేశారు. జూన్ 2 నుంచే తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటైనట్లుగా ఈ జీవోలో పేర్కొన్నారు.

TG-LOGO-NEWమండలిలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ హైదరాబాద్, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లను నియమించినట్లు జీవోలో పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తక్షణమే విధులు చేపట్టనున్నది. ఇందుకోసం చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శి పోస్టులను కూడా ఒకటి రెండు రోజుల్లో భర్తీ చేయనున్నారు.


తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చట్టాలను అనుస రించినట్లు జరిగిందని జీవోలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్థానంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాటైందని వివరించారు. ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన విధులన్నీ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఉన్నత విద్యా రంగానికి కావాల్సిన సలహాలు, సూచనలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహిస్తుందని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చట్టం 1988 ప్రకారం ఇప్పుడు ఏ రకమైన విధులు కొనసాగుతున్నాయో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నుంచి అలాంటి విధులే నిర్వహించాల్సి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు.

ఆంధ్ర పెత్తనానికి స్వస్తి...: ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలిలో ఆంధ్ర అధికారులదే పెత్తనం కొనసాగింది. ఉన్నత స్థాయిలో అత్యున్నత 8 పదవులలో అంటే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులలో ఆంధ్ర అధికారులే ఉన్నారు. ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లూ అంధ్ర ప్రాంతానికి చెందిన వారే. కార్యదర్శి స్థానంలో మాత్రమే తెలంగాణ ప్రొఫెసర్ ఉన్నారు.

తెలంగాణకు విద్యా మండలి ఏర్పాటైనందున అన్ని పదవులనూ తెలంగాణ వారితోనే భర్తీ చేస్తారు. అవసరమైతే కళాశాలల విద్య, ఇంటర్మీడియేట్ విద్య, సాంకేతిక విద్యతో పాటు యూనివర్సిటీల నుంచి కూడా డిప్యుటేషన్ పద్ధతిలో తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టీఎస్‌సీహెచ్‌ఈకి కావాల్సిన కొత్త పోస్టులు మంజూరు చేసి కామన్ ప్రవేశ పరీక్షల నిర్వహణ, యూనివర్సిటీ వ్యవహారాలు, డిగ్రీ, పీజీ కాలేజీల పరిశీలన వంటి విధులు తెలంగాణ అధికారులే స్వయంగా నిర్వహించుకోవడానికి మార్గం ఏర్పడిందని వారు చెప్పారు.

ఎంసెట్ వివాదానికి చెక్: ఎంసెట్ కౌన్సెలింగ్ వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా చెక్ పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా విడుదల చేసిన ఎంసెట్ కౌన్సెలింగ్‌తో ఇక తెలంగాణ విద్యార్థులకు సంబంధం ఉండదు. స్వరాష్ట్రంలో మన అడ్మిషన్లు మనమే నిర్వహించుకోవడానికి ఈ విద్యామండలితో అవకాశం లభించింది. ఇపుడు ఇక మనకు కావలిసిన రీతిలో అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.

ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాలు నిర్వహించడంతో పాటు ఉన్నత విద్య రంగానికి కావాల్సిన సలహాలు, సూచనలు కూడా నూతనంగా ఏర్పాటైన టీఎస్‌సీహెచ్‌ఈ నుంచి వస్తాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించుకోవడానికి కసరత్తు త్వరలో ప్రారంభిస్తున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో కౌన్సెలింగ్ గడువు కేసు విచారణకు రానున్నది. ఆ తీర్పునకు లోబడి ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల ప్రకటనపై తుది నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు.

ఉమ్మడి అడ్మిషన్లకు సానుకూలం..: తెలంగాణ ఉన్నత విద్యా మండలి కొత్తగా ఏర్పాటైనప్పటికీ పదేళ్ళ పాటు ఉమ్మడి అడ్మిషన్ల స్ఫూర్తికి ఆటంకం కాకుండానే.. అడ్మిషన్లు నిర్వహించుకునేలా మార్గదర్శకాలు తయారు చేయడానికి తెలంగాణ విద్యా శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అందుకోసం జీవో 5 ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఉమ్మడి అడ్మిషన్ల విషయంలో రాష్ట్ర పునర్విభజన బిల్లు 2014లో ఉన్న ఆదేశాలను అమలు చేస్తాం.. అదే సమయంలో మన కాలేజీలలో మనమే సీట్లు భర్తీ చేసుకోంటాం దీనికి ఈ జీవో ఎంతో ఉపయోగపడుతుంది అని అధికారులు వివరించారు.

టీఎస్‌సీహెచ్‌ఈ ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం పీ మధుసూధన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రైవేటు ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీ యాజమాన్య సంఘం నాయకులు కూడా తమ కాలేజీలలో తాము అడ్మిషన్లు నిర్వహించుకోవడంలో టీఎస్‌సీహెచ్‌ఈ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఈ విషయంలో తాము సహకరిస్తామన్నారు. సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర నాయకులు గౌతంకుమార్, సునీల్‌కుమార్‌లు తెలిపారు. తెలంగాణ విద్యా మండలి ఏర్పాటు పట్ల పలు రాజకీయ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాలు, టీచర్ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

వంశమూలాలతో స్థానికత గుర్తింపు

-తాత ముత్తాత వివరాలు తెలుసుకోవటం తేలికే
-మన అడ్మిషన్లు మనమే నిర్వహించుకొందాం
-విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి


ఇకపై మన రాష్ట్రంలో అడ్మిషన్లు మనమే నిర్వహించుకుందాం. త్వరలోనే ఎంసెట్‌తోపాటు పలు ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం షెడ్యూల్ ఖరారు చేస్తాం. ఇంజినీరింగ్ కాలేజీల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు జరుగుతున్నందునే రాష్ట్రంలో కౌన్సెలింగ్ ప్రక్రియ కొద్దిగా ఆలస్యమవుతున్నది.


హైదరాబాద్, ఆగస్టు 2 (టీ మీడియా): ఫాస్ట్ పథకం అమలులో విద్యార్థుల తాత ముత్తాతల వంశ jagadeshreddyమూలాల ఆధారంగానే స్థానికతను గుర్తిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. 1956 ఏడాది ప్రామాణికంగా స్థానికతను కచ్చితంగా నిర్ధారిస్తామని చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ విద్యార్థులకు కలిగే నష్టమేమీ ఉండదని భరోసా ఇచ్చారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానికత గుర్తింపు వల్ల విద్యార్థులు తెలంగాణవారా, ఆంధ్రావారా అనేది కచ్చితంగా తెలుస్తుందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా డీఎన్‌ఏ ఆధారంగా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని, పాత ఎముకల ఆధారంగా మనిషిని గుర్తిస్తున్న ఈ కాలంలో స్థానికతను గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదని పేర్కొన్నారు. ఏపీ విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేస్తారా లేదా అన్నదానిపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఎందు కు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఫాస్ట్ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు తయారవుతున్నాయని, ఈ పథకంతో తెలంగాణ సొమ్మును కాపాడుకుందామన్నారు. ఇప్పటివరకు తల్లిదండ్రులు లేకుండాఎవరూ లేరని, ఒకవేళ అలాంటి వారు ఎవరైన ఉంటే వారి ప్రయోజనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఫాస్ట్ పథకం అమలుకు సంబంధించి విద్యార్థుల ఆదాయంలో కొన్ని సవరణలు తీసుకొచ్చే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని తెలిపారు.

మన అడ్మిషన్లు మనమే నిర్వహించుకుందాం

తెలంగాణ రాష్ట్ర ఉన్నతవిద్యా మండలి ఏర్పాటవుతున్నందున మన రాష్ట్రంలో అడ్మిషన్లు మనమే నిర్వహించుకుందామని జగదీశ్‌రెడ్డి అన్నారు. త్వరలోనే ఎంసెట్‌తో పాటు పలు ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం షెడ్యూల్ ఖరారు చేస్తామన్నారు. చంద్రబాబు, ఉన్నతవిద్యా మండలి చైర్మన్ ఎల్ వేణుగోపాల్‌రెడ్డి కలిసే ఎంసెట్ కౌన్సెలింగ్‌పై నాటకాలాడుతున్నారని విమర్శించారు.  




No comments:

Post a Comment