Tuesday, August 19, 2014

ఉద్యోగాల భర్తీకి సర్వం సిద్దం

-త్వరలో 65వేల సర్కారీ కొలువుల భర్తీ
-నోటిఫికేషన్ల జారీకి అధికారుల సన్నాహాలు
-టీఎస్‌పీఎస్సీ ద్వారా 45వేల ఉద్యోగాల భర్తీ
-20వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ


నిరుద్యోగులు ఎంతోకాలంగా ఆశగా ఎదురుచూస్తున్న సర్కారీ ఉద్యోగాల జాతర త్వరలో మొదలుకాబోతున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో అవసరమైన పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.

Telangana-Logoప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 65వేలకుపైగా వివిధ రకాల ఉద్యోగాలను అత్యవసరంగా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ), ఇతర రిక్రూట్‌మెంట్ విభాగాల ద్వారా వరుస నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. రాష్ట్ర విభజనతో ఏర్పడిన ఖాళీలతోపాటు పోలీస్, విద్య, ఆరోగ్యశాఖలు, ట్రాన్స్‌కో, జెన్‌కో వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో భారీగా ఖాళీలున్నాయి. రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉండగా వాటిని దశల వారీగా భర్తీ చేసే అవకాశాలున్నాయని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో 50వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కే చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా లెక్కల ప్రకారం 50వేల పోస్టులతోపాటు అదనంగా మరో 15వేల పోస్టులు కూడా త్వరలో భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో వీలైనంత త్వరలో 65,400 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.


టీఎస్‌పీఎస్సీ ద్వారా 45వేల పోస్టుల భర్తీ

ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో టీఎస్‌పీఎస్సీ ద్వారానే దాదాపు 45వేలకు పైగా పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. వీటిలో గ్రూప్-1, గ్రూప్-2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్ తదితర ఉద్యోగాలున్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో ఇప్పటికే కొనసాగుతున్న ఉద్యోగులకు నష్టం లేకుండాఉద్యోగాలను భర్తీ చేయాలని భావించిన సీఎం, ఆ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై ఇప్పటికే కమిటీ కూడా వేశారు.

 

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో దాదాపు 4500 వరకు లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 4000 మంది కాంట్రాక్టు లెక్చరర్లు కొనసాగుతున్నారు. ఒకవేళ ఐదేండ్ల సీనియారిటీతో కాంట్రాక్టు పోస్టులను క్రమబద్ధీకరిస్తే దాదాపు 2000 పోస్టులు వారితో భర్తీ అవుతాయని సమాచారం. మిగిలిన 2500 జేఎల్ పోస్టులను నేరుగా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. అలాగే ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కలిపి మరో 1000 పోస్టులు భర్తీ కానున్నాయి. కొత్తగా ఏర్పాటైన టీఎస్‌పీఎస్సీకి వారంలోగా సభ్యుల నియామకం జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే కమిషన్ చైర్మన్ ఎంపిక ఖరారైనట్లు సమాచారం. సభ్యుల నియామకం అనంతరం పరీక్షల విధానం, సిలబస్‌కు తదితర అంశాలపై సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీలు వేసి వాటి సూచనలను అనుసరించి ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు తెలిసింది.

డీఎస్సీ ద్వారా 20 వేలకుపైగా పోస్టులు

పాఠశాల విద్యాశాఖలో అత్యధిక సంఖ్యలో టీచర్‌పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందు కోసం త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. వచ్చే వారంలోగా టీచర్ల రేషనలైజేషన్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. దీని ద్వారా రాష్ట్రంలోని టీచర్లు, విద్యార్థుల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటు విద్యాశాఖ హక్కు చట్టంలోని టీచర్ విద్యార్థి నిష్పత్తి ప్రకారం లెక్కలు సేకరించే పనిని మొదలు పెట్టారు. జిల్లాల వారీగా టీచర్ పోస్టుల ఖాళీలను సేకరించి వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 20 వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 



  

1 comment:

  1. Good information to know and right to the point. Thanks for this well written post, i’ll follow up for more updates if you keep posting them
    employment news

    ReplyDelete