Thursday, August 14, 2014

అంతర్జాతీయస్థాయిలో నగర పోలీస్ ఇమేజ్: సీఎం

వరల్డ్ క్లాస్ పోలీస్ వ్యవస్థను తయారు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా మొదటి అడుగును వేసింది. పోలీసుల కోసం తయారు చేయించిన అత్యాధునిక టెక్నాలజీ కలిగిన వాహనాలను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మొదటి విడతగా 100 ఇన్నోవా కార్లు, 300 ద్విచక్ర వాహనాలను పోలీసుల కోసం అందుబాటులోకి తెచ్చినట్లు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. 







హైదరాబాద్: హైదరాబాద్ పోలీసు బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. ఇవాళ ట్యాంక్‌బండ్‌పై పోలీసులకు కొత్త వాహనాల అందజేత సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగర ప్రజలకు ప్రభుత్వం ఇస్తోన్న కానుక ఇది అని తెలిపారు. రికార్డు సమయంలో పోలీసు వాహనాలను తయారు చేశామన్నారు. నగరంలో 3 నెలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పకడ్బంధీగా నిఘా ఏర్పాటు చేస్తామని నగర ప్రజలకు హామీ ఇచ్చారు. 24 గంటలపాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నగరం ఉంటుందని పేర్కొన్నారు.

మూడు నెలల్లో నిఘా నీడలోకి నగరం: సీఎం
హైదరాబాద్: మరో మూడు నెలల్లో హైదరాబాద్ నగరం సీసీ కెమెరాల నిఘా పరిధిలోకి రానుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నగరంలో ప్రపంచస్థాయి పోలీసు వ్యవస్థలో భాగంగా నేడు పోలీసు విభాగానికి కొత్త వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లండన్ నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల 85 శాతం నేరాలు తగ్గాయి. ఇదే విధానాన్ని అతిత్వరలోనే మన పోలీసులు అధ్యయనం చేసి నగరంలో అమలుపరచనున్నారు. నగరాన్ని 24 గంటలు పర్యవేక్షించేందుకు విస్తృతంగా సీసీ కెమెరాల ఏర్పాటు జరగనుంది. ఈ మేరకు రిలయన్స్ ప్రతినిధులు తమ వంతు సహకారం అందజేస్తామని తెలిపారు. నగరంలోని బంజారాహిల్స్‌లో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ పోలీస్ భవనంను ఏర్పాటు చేస్తాం. అంతర్జాతీయ స్థాయిలో మన లా అండ్ ఆర్డర్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన పేర్కొన్నారు.

‘రాజధానిలో పేకాట క్లబ్బులు ఉండటానికి వీల్లేదు’
హైదరాబాద్: నగరంలో పేకాట క్లబ్బులు ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పోలీసుశాఖకు నేడు కొత్త వాహనాలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేకాట క్లబ్‌ల నిషేదంపై చాలా మంది ఆడపడుచులు హర్షం వ్యక్తం చేశారన్నారు. అదేవిధంగా నగరంలో రన్నింగ్ బస్సు ఎక్కే పద్ధతి పోవాలన్నారు. ఇందుకుగాను రవాణాశాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని సూచించారు. ముంబాయిలో ఉన్న రవాణా వ్యవస్థను అధ్యయనం చేసి మనదగ్గర కూడా అటువంటి విధానాన్ని అమలుచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజలు సహకరించాలి:
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే క్రమంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పోలీసులు ఏవిధంగానైతే అనుసరిస్తామంటున్నారో అదేవిధంగా ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. ఏం జరిగినా పోలీసులకు సమాచారం తెలియజేసే సంస్కృతి పెరగాలని సీఎం పేర్కొన్నారు.  





No comments:

Post a Comment