Thursday, July 31, 2014

Telangana News dtd 31-07-14












కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం వెబ్‌సైట్
హైదరాబాద్: రాష్ట్ర కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేశారు. తెలంగాణ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ ఈ వెబ్‌సైట్‌కు బాధ్యత వహిస్తున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరూ తమ పూర్తి సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వెబ్‌సౌట్‌లో ఉద్యోగులు తమ పూర్తి వివరాలను నమోదుచేసిన తర్వాత ఆ కాపీలను రాష్ట్ర కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గౌరవాధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు, టీఎన్జీవోల చైర్మన్ దేవీప్రసాద్‌కు అందచేస్తామని తెలిపారు. www.tcosnews.blogspot.com పేరుతో ఏర్పాటుచేసిన ఈ వెబ్‌సైట్‌లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరూ శాఖలవారీగా తమ పూర్తి వివరాలను పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు.  



 రైతు బాంధవుడు కేసీఆర్
-సింగూరు జలాలపై ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నారు
-డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రశంసలు
-ఘనపురం ఆయకట్టుకు 0.25 టీఎంసీల నీటి విడుదల
పుల్కల్, జూలై 30 (టీ మీడియా): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రైతు బాంధవుడని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కొనియాడారు. అధికారంలోకి వచ్చాక రైతుసంక్షేమం కోసం కృషి చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారని ప్రశంసించారు. మెదక్ జిల్లాలోని ఘనపురం ఆయకట్టు రైతులకు సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించారని పొగిడారు. ఎన్నో ఏళ్లుగా రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ సమైక్యప్రభుత్వాలు వినిపించుకోలేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం నీటిని విడుదల చేయడం అభినందనీయమన్నారు.

బుధవారం సింగూరు ప్రాజెక్టు నుంచి 0.25 టీఎంసీల నీటిని ఘనపురం ఆనకట్టుకు డిప్యూటీ స్పీకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశలవారీగా రైతులకు నీటిని విడుదల చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలో 51శాతం లోటు వర్షపాతం నమోదవడం బాధాకరమన్నారు. ఈ నీటితో ఘనపురం ఆయకట్టు కింద 12 వేల ఎకరాల నారుమడులకు నీరందుతుందన్నారు. గతంలో నీటికోసం ధర్నాలు, ఉద్యమాలు చేసినప్పటికీ సమైక్యప్రభుత్వాలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చి ఆయకట్టును విస్మరించిందని విమర్శించారు.

రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్, భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుల కృషితోనే ఇప్పుడు రైతులకు కష్టకాలంలో సింగూర్ నీటిని అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్ శరత్, మెదక్ ఆర్డీవో వనజాదేవి, ఇరిగేషన్ జేఈ నీలిమ, డిప్యూటీ ఈఈ జగన్నాథం, ఏఈలు, ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు.
  

No comments:

Post a Comment